అరణ్యవాస కాలంలో ఒకరోజు పాండవులు ఆహారం కోసం బయల్దేరారు. ఆ సమయంలో, తృణబిందు మహాముని ఆశ్రమ పరిసరాల్లో ద్రౌపది ఒంటరిగా పనుల్లో నిమగ్నమై ఉంది. ఆ దారిలో వెళ్తున్న సైంధవుడు (జయద్రథుడు), ఆమె అపూర్వ సౌందర్యాన్ని చూసి మోహితుడయ్యాడు. వెంటనే తన రథాన్ని ఆపి, తోడుగా ఉన్న కోటికాస్యుణ్ణి ఆమె ఎవరో తెలుసుకుని రావాలని ఆదేశించాడు. కోటికాస్యుడు ద్రౌపది గురించి వివరిస్తే, సైంధవుడు ఆమెను సమీపించి, తన గురించి చెప్పి, మొదట పాండవుల యోగక్షేమాలను ప్రశ్నించాడు.
సైంధవుడు వరసకు కౌరవరాజ కుమార్తె దుస్సల భర్త కావడంతో, ద్రౌపది అతనికి గౌరవంగా సమాధానం ఇచ్చింది. అతిథి మర్యాదలు చేసి, అతడిని సత్కరించింది. అయితే, సైంధవుడు అక్కడితో ఆగకుండా, ద్రౌపదిని తనతో రావాలని కోరాడు. ద్రౌపది అలా మాట్లాడరాదని గట్టిగా హెచ్చరించింది. కానీ, సైంధవుడు దాన్ని పట్టించుకోకుండా, ఆమె మాటను తక్కువ చేసి, బలవంతంగానైనా తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
దీంతో కోపోద్రిక్తురాలైన ద్రౌపది, “ఓ మూర్ఖుడా! వెదురు, అరటి, రెల్లు చెట్లు తమ అంత్యకాలంలో ఫలించినట్లుగా, మరణ సమీపించినప్పుడు ఎండ్రకాయ గర్భం దాల్చినట్లుగా, నీ చావు సమీపిస్తుండగా నన్ను అపహరించాలనుకుంటున్నావా?” అని తీవ్రంగా హెచ్చరించింది.
వ్యాస మహాభారతంలో “ఎండ్రకాయకు తోడు తేలు” అనే ఉపమానం ఇస్తే, అరణ్యపర్వాన్ని రాసిన ఎర్రాప్రగడ, ద్రౌపదిచే “ప్రాణం పోయే సమయంలో తేలు, ఎండ్రకాయ గర్భం దాల్చినట్లుగా, నీ దుష్టచర్యలు త్వరలో నీ మరణానికి సంకేతం!” అని చెప్పించారు.
ఈ కథ ద్వారా, స్త్రీ వ్యామోహంతో సంస్కారాన్ని, నీతినిబంధనలను మరచిపోయి, అగౌరవంగా వ్యవహరిస్తే, చివరకు మరణమే శిక్షగా వస్తుందని మహాభారతం స్పష్టం చేస్తుంది.