‘అన్య మత మార్పిడులు అధికమై, హైందవ సనాతన సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్న విషమ పరిస్థితులు,పుష్టి మత స్థాపకుడు శ్రీపాద వల్లభాచార్య అవతరణకు కారణ భూతమైంది.
వైదిక నిష్టా గరిష్ఠుల కుటుంబంలో జన్మించి వైష్ణవ మతాచార్యుడు అయిన జగద్గురు,మహాప్రభు శ్రీమత్ వల్లభాచార్య,భారతావనిలో శుద్ధ అద్వైతాన్ని పాటించే పుష్టి మత స్థాపనాచార్యులు అయ్యారు.క్రీస్తుశకము 1479 లో (విక్రమార్క శకం 1535) చైత్ర కృష్ణ పక్ష ఏకాదశి( పరూధిని ఏకాదశి నాడు లక్ష్మణ భట్టు, ఎలమగర దంపతులకు రెండవ కుమారునిగా వల్లభుడు అవతరించారు.
100 సోమయాగాలు చేశాక,తాను తమ వంశములో ఉదయిస్తానని శ్రీకృష్ణ భగవానుడు,వల్లభుని పూర్వజులైన యజ్ఞ నారాయణా చార్యులకు చేసిన ఆదేశానుసారం,ఆయన తరువాతి వారైన లక్ష్మీ నారాయణ భట్టు,శతాధిక సోమయాగాలు పూర్తి చేసిన క్రమంలో,కాశీలో పల్లభుడు భూమిపై అవతరించారు.బాల్యం నుండే వేదాలు ఉపనిషత్తులు,అష్టాదశ పురాణాలు పఠించి,తర్వాతి కాలంలో,ఆదిశంకర,రామా నుజ, మధ్వాచార్య, బౌద్ధ, సిద్ధాంతాలపై అమూలాగ్ర అవగాహన పొంది,దేశం నలుమూలల పర్యటించి, భక్తి మార్గం నిర్దేశకులు అయ్యారు.
“భగవత్ సాన్నిహిత్య సాధనకు సాధువులే కానక్కరలేదని,కౌటింబిక జీవన విధానంలోనూ,కృష్ణ భగవానుని భక్తితో కొలిస్తే,ముక్తి లభించగలదని”,కొత్త సంప్రదాయానికి పురుడు పోసారు. భారతావనిలో ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,రాజస్థాన్ లాంటి చోట్ల” కొత్త ప్రతిపాదన” ప్రభావం చూపి, వందలాదిగా పల్లభుని అనుసరించారు.
వైష్ణవ మత వ్యాప్తికి,నడుము బిగించి,దేశాటన చేస్తూ,వివిధ చోట్ల భిన్న మతస్థులతో వాదోపవాదాలు జరిపి, తన మతానికి వారిని మళ్ళించారు. శ్రీకృష్ణ దేవరాయల దర్బారులో,మధ్వాచార్య,శంకరా చార్య అనుయాయుల మధ్య జరిగిన చర్చలలో పాల్గొని,27 రోజులు విస్తృతంగా చర్చించి, శైవులను ఓడించి, సభికులను ఒప్పించి,మెప్పించి,కనకాభిషేకం చేయించుకున్నారు.
ఆ సమయంలో ఆచార్య “జగద్గురు” బిరుదాంకితులు అయ్యారు.ఉజ్జయిని,ప్రయాగ,కాశీ,హరిద్వార్, బద్రీనాథ్,కేదార్నాథ్ తదితరాలను సందర్శించి,చివరకు మధుర వద్ద, బృందావనంలో కొంతకాలం గడిపారు. శ్రీకృష్ణుడు స్వప్న సాక్షాత్కారియై,గోవర్ధనగిరిపై శ్రీనాథ విగ్రహం కలదని,దాన్ని వెలికి తీసి, ఆలయం నిర్మించి,విగ్రహ ప్రతిష్ట చేసి,పూజాదికాలు జరిగేలా చూడాలని చేసిన ఆదేశానుసారం,1520 లో శ్రీనాథ ఆలయం నిర్మించారు.అందుకే వల్లభుని మతాన్ని “శ్రీనాథ మతం” అంటారు. “చివరికి కాశీ” లో స్థిరపడ్డారు.
బాదరాయణ బ్రహ్మ సూత్రాలకు,జైమినీ పూర్వ మీమాంస సూత్రాలకు,అనుభాష్యం రచించారు. భాగవత దశమ స్కందానికి సుబోధిని వ్యాఖ్యాస గ్రంథ రచన చేశారు. మధురాష్టకం,చతు చతు శ్లోకీ,వచనామృతం, భాగవత ఏకాదశ స్కంధ అర్థ నిరూపణ కారిక,భక్తి వర్దిని,అంతఃకరణ ప్రబోధ,సిద్ధాంత రహస్యం,పుష్టి ప్రవాహ మర్యాద,శ్రీకృష్ణ జన్మ పత్రిక,పురుషోత్తమ సహస్ర నామాలు,యమునాష్టకం,సిద్ధాంత ముక్తావళి, సవరత్నం లాంటి గ్రంథాలు ఎన్నో విరచించారు.
శంకరాచార్యుని సిద్ధాంతాలతో విభేదించి,మాయావృతం కాని పరబ్రహ్మమే పరమ సత్యమని ప్రతిపాదించిన కారణంగానే,ఆయన వాదానికి శుద్ధ అద్వైతం అనే నామం శాశ్వతమైంది.పరమాత్మ సచ్చిదానంద స్వరూపం కాగా,జీవుడు సత్ చిత్ రూపం మాత్రమే.జీవుని నుండి, ఈశ్వరుడు ఆనందాన్ని మరుగు పరిచాడు.అందుకే జీవుడు అజ్ఞాన పశుడై,సంసార బద్ధుడై,దుఃఖ బాధితుడు అవుతున్నాడు,అని తాత్విక చింతనను మిగుల ప్రచారం చేశారు.1531లో తమ 52వ ఏట శ్రీనాధుని అజ్ఞానువర్తియై, ప్రాపంచిక జీవితాన్ని వదిలి గంగానదిలో జల సమాధి అయ్యారు.